‘అరవింద సమేత’ – సినిమా రివ్యూ
చిత్రం : అరవింద సమేత
నటీనటులు : ఎన్టీఆర్, పూజాహెగ్డే, ఈషా రెబ్బా, సునీల్, జగపతిబాబు, నాగేంద్రబాబు, తదితరులు
సంగీతం : ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం : పి.ఎస్.వినోద్
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాత : ఎస్.రాధాకృష్ణ
రచన, దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేదీ : అక్టోబర్ 11, 2018
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న అందరు స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేసాడు ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తప్ప. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఫైనల్ గా “అరవింద సమేత వీర రాఘవ” సినిమాతో వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయ్యింది. “అజ్ఞ్యతవాసి” లాంటి ఫ్లాప్ సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి స్థాయి రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో ఒకసారి రివ్యూ లో చూద్దాం.
కథ:
కథ గురించి సింపుల్ గా మాట్లాడుకోవాలి అంటే తన తండ్రి మరణం ద్వారా కలత చెందిన వీర రాఘవ రెడ్డి (జూనియర్ ఎన్టీఆర్) తన ప్రాంతం లో అలాగే సీమలో ఎక్కడా ఫ్యాక్షన్ అనేది లేకుండా చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలోనే అరవిందతో (పూజ హెగ్డే) రాఘవ రెడ్డికి పరిచయం అవుతుంది. ఈ పరిచయం రాఘవ రెడ్డి జీవితాన్ని ఎలా మార్చింది. నాకు ఫ్యాక్షనే కావలీ, పగే కావలీ అంటూ బతికే బసిరెడ్డిని (జగపతి బాబు) జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా మార్చాడు, అసలు మార్చాడా లేదా అనేది మిగిలిన కథ.
నటీనటులు:
జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. దాదాపు “టెంపర్” తరువాత మళ్ళీ తనలో ఉన్న నటుణ్ణి తట్టి బయటకి లేపాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటన ప్రేక్షకులని కథలో మమేకం అయ్యేలా చేస్తుంది. ఎమోషనల్ సీన్లలో తారక్ నటన అధ్బుతం. సినిమా ఎమోషన్ మొత్తాన్నీ తన భూజల మీద వేసుకొని నడిపించాడు తారక్. ఇక యాక్షన్ సీన్లలో అయితే తారక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. పూజ హెగ్డే కూడా ఇప్పటి వరకూ నటించిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బాగా నటించింది. తన క్యూట్ క్యూట్ హావభావాలతో పూజా యువతని ఆకట్టుకోవడం ఖాయం. అలాగే హీరోయిన్ ఈశ రెబ్బ కూడా తన పాత్రతో మెప్పించింది. ఇకపోతే సునీల్ ని చాలా రోజుల తరువాత కమెడియన్ గా చూడటం బాగుంది. సునీల్ మళ్లీ ఈ సినిమాతో ఉత్తమ నటనను ప్రదర్శించాడు. ఇక జగపతి బాబు గురించి మాట్లాడాలంటే “లెజెండ్” లాంటి సినిమా తరువాత మళ్లీ అంత పవర్ ఫుల్ రోల్ ఈ సినిమా ద్వారా జగపతిబాబుకి దక్కింది అని చెప్పవచ్చు. తన లుక్ తోనే ఒక విలనిజాన్ని చూపించాడు జగపతిబాబు. రాయలసీమ యాసని అవలీలగా మాట్లాడి ప్రేక్షకులని మెప్పించాడు జగపతి బాబు. అలాగే నాగబాబు, నరేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ పి.ఎస్. వినోద్ తన అవుట్ స్టాండింగ్ విసువల్స్ తో సినిమా కథని ముందుకు నడిపించాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ అన్నింటినీ చాలా సహజంగా చూపించాడు పి.ఎస్. వినోద్. అలాగే ఎస్.ఎస్. తమన్ కూడా తన సంగీతంతో సినిమా కథకి బలంగా నిలిచాడు. ఇప్పటికే “పెనివిటి” సాంగ్ తో ఆకట్టుకున్న తమన్ ఎమోషనల్ సీన్లకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటే ఒక మంచి కథ చెప్పాలని ప్రయత్నించాడు. కథని నిజాయితీగా చెప్పడంలోనూ విజయం సాధించాడు. కథనంలో ఎక్కడా బోర్ కొట్టించకుండా తాను చెప్పాలనుకున్నది సుత్తి లేకుండా చెప్పేశాడు త్రివిక్రమ్. ముఖ్యంగా మొదటి అర గంట సినిమాని త్రివిక్రమ్ చాలా అధ్బుతంగా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బాగుంది. అలాగే రాయలసీమ మాండలికంలో త్రివిక్రమ్ మాటల్ని బాగా రాశాడు.
చివరి మాట:
గురూజీ పెన్ పవర్ కి తారక్ అధ్బుతమైన నటన తోడైతే అదే “అరవింద సమేత వీర రాఘవ”. ఇంత కాలం మనకి ఫ్యాక్షన్ సినిమాలు అంటే చంపుకోవడం, నరుక్కోవడం మాత్రమే తెలుసు, కానీ రాయలసీమలో ఒక కొత్త కోణం లో చూపించి సక్సెస్ అయ్యాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
తెలుగు ఇన్సైడర్ రేటింగ్ : 3/5
తెలుగు ఇన్సైడర్ మాట: అరవింద సమేతంగా హిట్టు కొట్టిన వీర రాఘవుడు.
Aravinda sametha movie review
http://www.teluguinsider.com/